తెలుగుదేశం పార్టీ కోసం ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తానని నందమూరి హీరో బాలకృష్ణ అన్నారు. తెదేపాలో ఎలాంటి పదవులు తనకు అవసరం లేదని, ఏ పదవి ఇచ్చినా పనిచేస్తానని బాలయ్య అన్నారు.
తెలుగుదేశం పార్టీని వీడేవారికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. తెదేపాలో నాయకత్వ మార్పు ఇప్పుడు అవసరం లేదని, 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబేనని బాలయ్య శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. స్వార్థంతో పార్టీ మారే వారికి ప్రజలే బుద్ధి చెప్తారని, నందమూరి కుటుంబంలో ఎలాంటి విభేదాలకు తావులేదని బాలయ్య చెప్పారు.
అభిమానుల పేరుతో పార్టీకి నష్టం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బాలయ్య బాబు వెల్లడించారు. పార్టీ అభిమానులు కోరుకుంటే చంద్రబాబు తనయుడు, తన అల్లుడు లోకేష్ రాజకీయాల్లో వస్తారని, అందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. కార్యనిర్వాహక అధ్యక్ష పదవి తనకు కావాలని కోరలేదు. తనకు ఏ పదవి ఇవ్వాలన్నదే పార్టీ నిర్ణయిస్తుందని బాలయ్య వెల్లడించారు. Published Date: 2012-07-15 05:07:12 GMT
|