సినిమాకు కథల్లేవని అంటుంటారు. కానీ ఇటీవల విడుదలై సక్సెస్ అయిన చిత్రాలు పరిశీలిస్తే.. ఒకటి గోచరమవుతుంది. కథనేది మూలమని .కథనే నమ్ముకుని చిత్రాలు తీస్తే ఎప్పుడూ ఫెయిల్యూర్ కావని ఇండస్ట్రీ మాట. కథతోపాటు నటీనటులు కూడా భారీగా ఉంటేనే సక్సెస్ ఉంటుందని కొందరి వాదన. స్టార్ హీరోలకు కథలు అవసరంలేదని మరికొందరి భావన. అందుకే పూరీ జగన్నాథ్ ఇటీవల రవితేజ నటించిన 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం గురించి చెబుతూ.. కథంటూ లేని సినిమా... ఏదో అనుకుని సినిమా తీసేశానని అన్నారు. కానీ ఆ తర్వాతే.. కథ అనేది ఉంది. లేకపోవడమంటే.. లేదని కాదంటూ మాటమార్చాడు.
అందుకే కథలు విడిచి షూటింగ్‌లు చేస్తే స్టార్ హీరోలు తర్వాత డైలమాలో పడాల్సి వస్తుంది. సక్సెస్‌లో ఏం చెప్పినా చెల్లుతుందనే రోజులు పోయాయి. అదృష్టం బాగుంటే ఆడుతుంది. లేదంటే.. ఢమాలంటుంది. ఈ రోజుల్లో అనే చిన్నచిత్రం.. విడుదలై భారీగా వసూలు చేసింది. దీన్ని చిన్న సినిమా అంటే నరికేస్తానని దాసరి సక్సెస్ మీట్‌లో ఆవేశంగా మాట్లాడాడు.
అదే సక్సెస్ కాకపోయి వుంటే.. మాట మారేది. ప్రేక్షకులకు నచ్చింది. అది ఎలాంటి ప్రేక్షకులకు.. ఈనాటి యూత్‌కు. అమ్మాయిలు అబ్బాయిలను తన అవసరాలకు ఉపయోగించుని డబ్బు ఖర్చు పెట్టించడం వంటి కాన్సెప్ట్‌తో సినిమా వచ్చింది. తీసిన దర్శకుడు యువకుడే. నెక్లెస్ రోడ్, ఐమాక్స్, పబ్‌లలో యూత్‌ను పరిశీలించి ఏడాదిపాటు కథను తయారుచేసుకున్నాడు. తను అనుకున్న టార్గెట్‌కు చేరుకున్నాడు.
ఇటీవలే విడుదలైన 'రొమాంటిక్ క్రైమ్‌స్టోరీ' కూడా బాగానే ఆడుతోంది. అది కూడా యువతీయువకులే చూస్తున్నారు. ఫ్యామిలీతో చూడాలంటే కష్టం. అదొక బూతు సినిమా అని విమర్శకులు మాట. కానీ దర్శకడు మాత్రం.. అందులోనూ నీతికథ ఉంది. బూతు కథయినా సినిమాకు ప్రధానంగా కథే కనుక. రెండూ టచ్ చేసి యూత్‌కు సందేశం ఇచ్చామని అంటున్నాడు.
దీంతో చిన్న చిత్రాల పేరుతో హడావుడిగా చుట్టేసిన చిత్రాలు వచ్చాయి. ఓపెనింగ్స్ వరకు కొన్ని వస్తే.. కొన్ని కొద్దిరోజలపాటు షూటింగ్ జరుపుకున్నాయి. ఆ తర్వాత రిలీజ్‌కు ఎలా చేయాలో తెలియక ఆగిపోయాయి. ఎందుకంటే.. వారిదంతా ఒకే ఫార్మెట్. దాన్ని చూసి కొనేవాడు లేడు. మొన్ననే రిలీజైన 'ఇది ప్రేమకథ కాదు' చిత్రం దీనికో ఉదాహరణ. ఇంటర్ చదువుతున్న కుర్రాడితో వాళ్ళ నాన్నే హీరోగా పెట్టి సినిమా తీసేశాడు. దర్శకునిగా అనుభవం లేదు. పరిశీలనతో చేసేశాడు. ఆ కుర్రాడు మాత్రం నిజం చెప్పాడు. నేను చదువుకు విదేశాలకు వెళుతున్నాను. నాన్నగారు నాకు గుర్తుగా ఓ చిత్రాన్ని చేశారని చెప్పేశాడు. ఇలా కూడా సినిమాలు తీస్తారా అనిపించింది. ఈ చిత్రం చూసేవారికి పరీక్షే.
అందుకే ఒకే తరహా చిత్రాలు చేస్తే ఇండస్ట్రీ సక్సెస్ రేటును పడేస్తాయని ఛాంబర్ కార్యదర్శి ప్రసన్నకుమార్ తెలియజేస్తున్నారు. ఇలాంటివారు చాలా జాగ్రత్తతో సినిమా తీయాలని సూచించారు. నీతి పేరుతో బూతు చిత్రాలు తీస్తే అది వారి కుటుంబసభ్యుల్ని గుర్తు చేసుకుని తీయండంటూ హితవు పలుకుతున్నారు. ఇటీవలే చిన్న సినిమా ఫంక్షన్‌లో ఆయన పాల్గొన్నారు. మామూలుగా సినిమా గురించి బాగా చెబుతారు. కానీ ఈ సినిమా గురించి చెప్పడం ఇష్టంలేక.. వారికి చురక వేశారు. ఆ సినిమా పేరు 'టీచర్ ఐ లవ్ యు..'.. అందుకే ఆయన ఏమీ మాట్లాడకుండా టీచర్లను మంచిగా చూపిస్తారనుకుంటున్నాని చెప్పాడు.
మరి సెన్సార్ వారు ఏంచేస్తున్నారనే డౌట్ రావచ్చు. ఈ సినిమాను చూసి 'సారీ టీచర్' అనే పేరు మార్చమన్నారట. దాంతో పేరును మార్చేసి చేతులు దులుపుకున్నారు. సెన్సార్ కావడానికి భారీగానే ముట్టచెప్పాల్సి వచ్చింది. ముందు అక్కడ పరిస్థితి మారితీనే నిర్మాతలు దారిలోకి వస్తారు. లేదంటే.. నీతిమాలిన చిత్రాలు వస్తాయనడంలో ఏమాత్రం సందేహంలేదు. Published Date: 2012-08-01 07:40:47 GMT
|