ఇప్పుడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా ప్రత్యేకమైన పాయింట్ల వద్ద పెద్దపెద్ద ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఫ్లెక్సీలు చూస్తూనే ఉంటాం.. ఐతే ఏంటట..? అనుకోవచ్చు. కానీ ఇదే ఇప్పుడు చర్చనీయాంశమై కూర్చుంది.
గుంటూరులో వైకాపా నాయకులు కొంతమంది జాతిపిత గాంధీజీ, జగన్ మోహన్ రెడ్డిలిద్దరూ జైలు ఊచలు వెనుక ఉన్న ఫోటోలు ముద్రించారు. ఇంకా ఆ ఫోటోల కింద "బాపూజీకి తెల్లదొరల కాలంలో..., జగన్‌కు నల్లదొరల కాలంలో జైలు... చూస్తున్నావా బాపూ" అంటూ వ్యాఖ్యలు రాశారు.
ఈ ఫ్లెక్సీలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంత రావు మండిపడ్డారు. భారతదేశానికి స్వేచ్ఛాస్వాతంత్రాలను ప్రసాదించిన మహాత్మా గాంధీజీతో అవినీతి రొంపిలో కూరుకుపోయిన జగన్‌ను పోల్చడమా.. ఛీ.. అంటూ చిందులేశారు.
ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టిన వారికేమయినా పిచ్చి పట్టిందా అంటూ ధ్వజమెత్తారు. ఇకనైనా అధికారులు ఇలాంటి ఫ్లెక్సీలు కనబడితే వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. గాంధీజీ పక్కన జగన్ బొమ్మను పెట్టి అపచారం చేసినందుకు గాంధీజీ విగ్రహానికి ఆయన పాలాభిషేకం చేశారు. Published Date: 2012-08-16 15:14:29 GMT
|