|
మహారాష్ట్ర తాను చెప్పినట్లే చంద్రబాబు నాయుడుతో సహా పలువురు ఎమ్మెల్యేలను అరెస్టు చేసింది. సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న దృష్ట్యా చంద్రబాబును వ్యూహాత్మకంగా మహా పోలీసులు అరెస్టు చేసి ధర్మాబాద్ పోలీసు స్టేషనుకు తరలించారు.
గోదావరి నదిపై మహారాష్ట్ర నిర్మించిన అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు తెలుగుదేశం పోరుబాట పట్టింది. శుక్రవారం చంద్రబాబుతో సహా 120 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టును సందర్శించి అసలు నిజాలను నివేదించేందుకు బస్సు యాత్ర చేపట్టారు. అయితే ఇది తెలుసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఆంధ్ర - మహారాష్ట్ర సరిహద్దు వెంట భారీ సంఖ్యలో మొహరించింది.
దీంతో చంద్రబాబుతోపాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలంతా అక్కడే రోడ్డుపై బైఠాయించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... తామేమీ టెర్రరిస్టులం కాదనీ, బాబ్లీ ప్రాజెక్టును సందర్శించడానికి వచ్చామని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే ఈ సమస్యపై జాతీయస్థాయిలో చర్చ జరగాలని బాబు డిమాండ్ చేశారు.
తాము శాంతియుతంగా బాబ్లీ ప్రాజెక్టును సందర్శించేందుకు వస్తే మహారాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ యుద్ధ వాతావరణాన్ని సృష్టించిందని మండిపడ్డారు. తాము చట్ట వ్యతిరేక కార్యకలాపాలకేమీ పాల్పడలేదనీ, బాబ్లీని చూసేందుకే వచ్చామన్నారు. అయినా బాబ్లీని చూసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిరాకరిస్తుందీ... చూస్తే తమ అక్రమ నిర్మాణాల బండారం బయటపడుతుందన్న భయమా...? అని ప్రశ్నించారు. మహారాష్ట్ర ప్రభుత్వం విధానాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నామని బాబు అన్నారు.
సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో మహారాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చింది. చంద్రబాబుతో సహా మరో 10మంది ఎమ్మెల్యేలను బాబ్లీ సందర్శనకు అనుమతినిచ్చింది.
Published Date: 2010-07-16 03:22:53 GMT
|